కరోనా మహమ్మారి ఏడుకొండలపై స్వైర విహారం చేస్తోంది. తిరుమలలో రోజురోజుకూ వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు స్వామీజీని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్‌కు తరలించారు. దీంతో ఇప్పటివరకూ 170 మంది వైరస్‌ బారిన పడ్డారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రధానాలయ జీయర్‌ స్వామిజీతో సహా 18 మంది అర్చకులు, 100 మంది సెక్యూరిటీ సిబ్బంది, కల్యాణకట్టలోని ఇద్దరు, 20 మంది ప్రసాదాల తయారీ కేంద్రమైన పోటు ఉద్యోగులకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.

      కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మార్చి 20న తిరుమల దేవస్థానాన్ని మూసివేశారు. భక్తుల దర్శనాలను నిలిపివేసి, స్వామివారి నిత్య కైంకర్యాలను కొనసాగించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో సుమారు 80 రోజుల తర్వాత.. జూన్‌ 11న శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. అప్పటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

      ఇటీవల జరిగిన సమావేశంలో 60 ఏళ్లు నిండిన అర్చకులకు విధుల నుంచి మినహాయింపులు ఇచ్చామని, అర్చకుల క్షేమం, వారి భద్రతపై దృష్టిని కేంద్రీకరించామని చెప్పారు. అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామివారికి సేవలు నిరాటంకంగా సాగుతాయని, వైరస్‌ మరింతగా విస్తరిస్తే, దర్శనాలను మరోమారు నిలిపివేసే ఆలోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయం అతి త్వరలో తీసుకుంటామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here