కేరళలోని ప్రముఖ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఆలయ మేనేజ్‌మెంట్‌ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి అనుకూలంగా జస్టిస్‌ యు యు. లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ ఆలయ నిర్వహణ బాధ్యతను రాజకుటుంబానికే అప్పగిస్తున్నట్లు చెప్పింది. చరిత్రాత్మకమైన ఆలయం ఆస్తుల్లో ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి హిందూధర్మ చట్టం ప్రకారం హక్కు ఉన్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఒకరి దైవారాధనకు చెందిన హక్కులు ఆ కుటుంబంపై ప్రభావం చూపవని, ఇది ఆచారం ప్రకారం కొనసాగుతుందని ఆలయ నిర్వహణపైన కూడా సుప్రీం తీర్పునిచ్చింది. దీనిపై ఇప్పటికే త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యోంలో ఓ కమిటీని నియమించి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకూ ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.

      కాగా ఆలయ సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్‌కోర్‌ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ట్రావెన్‌కోర్‌ రాజవంశీయులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. గత ఏడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్‌ చేసి, ఈ రోజు తీర్పు వెల్లడించింది.       అనంత పద్మనాభస్వామి దేవాలయం నేలమాళిగల్లో భారీ నిధి నిక్షేపాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబమే ఈ నిధులను కాపాడుకుంటూ వస్తోంది. అయితే, కొంతకాలం క్రితం వీటి నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో ట్రావెన్‌కోర్‌ కుటుంబసభ్యులు సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలు రాజకుటుంబానికే ఉండటాన్ని సమర్థించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here