దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ల‌లో వరుసగా రెండో రోజూ బుల్ జోరు కొన‌సాగింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ 523 పాయింట్లు లాభపడి 34,731 పాయింట్ల‌ వద్ద ముగియగా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 10,244 వద్ద క్లోజ్ అయ్యింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ మొద‌ల‌వ‌గానే స్టాక్ మార్కెట్లు లాభాల బాట‌లో ప‌య‌నించాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 200 పాయింట్లు లాభపడింది. ఆ త‌ర్వాత కూడా ఆదేజోరు కొన‌సాగింది. 

ఒకానొక దశలో 34,848 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరకు 523 పాయింట్ల లాభంతో 34,731 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్ మొద‌ట్లోనే 10,100 మార్కును దాటింది. త‌ర్వాత కూడా లాభాల పరంప‌ర కొన‌సాగింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్ల‌కు క‌లిసొచ్చాయ‌ని, విదేశీ మదుపరులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం కూడా మార్కెట్లు లాభాలు కూడ‌గ‌ట్ట‌డానికి కార‌ణ‌మైంద‌ని మార్కెట్‌ విశ్లేష‌కులు తెలిపారు.  కాగా, ఇవాళ్టి ట్రేడింగ్‌లో బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ తదితర కంపెనీల‌ షేర్లు లాభపడగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, వేదాంత, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.10 వద్ద కొనసాగుతున్న‌ది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here