దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం ఒకవైపు కరోనా మహమ్మారితో విలవిలలాడుతోంది. మరోవైపు భారీ వర్షాల రూపంలో మరో విపత్తు ఏర్పడింది. థానేతో సహా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు కూడా వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రాబోయే 24 గంటల్లో ముంబయి సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనాలు తోడవడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై మహానగరం వర్షాలకు అతలాకుతలం అవుతోంది. చెంబూర్, సెంట్రల్ ముంబయి నీటమునిగాయి. గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో సెంట్రల్ ముంబయిలోని హింద్మతా తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గడచిన 24 గంటల్లో దక్షిణ ముంబయిలోని కొలాబా అబ్జర్వేటరీలో 129.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా.. శాంతాక్రూజ్ ప్రాంతంలో 200.8 మి.మీ వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ వర్గాలు వెల్లడించాయి.
థానే జిల్లా పరిసర ప్రాంతాలతో సహా కొంకణ్ ప్రాంతంలోని సింధ్‌దుర్గ్ లో భారీ వర్షపాతం నమోదయినట్లు తెలిపారు. విదర్భలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడినట్లు వాతావరణ వర్గాలు తెలిపాయి. వర్షపాతం కారణంగా శనివారం ముంబయిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.