కరోనా కారణంగా వాయిదా పడిన నితిన్, షాలినిల ఎంగేజ్మెంట్ నిరాడంబరంగా జరిగింది. కరోనా నిషేధాజ్ఞలతో ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోను నితిన్ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి వివాహ వేడుక ఈ నెల 26న ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఫలక్నామా ఫ్యాలెస్‌లో జరగనుంది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ వివాహం జరగనుంది.
వివాహానికి సంబంధించి నితిన్ కుటుంబం ఇప్పటికే అతిథులకు శుభలేఖలు అందించింది. ఐదు రోజుల పాటు జరగనున్న పెళ్ళి సంబురాలకి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొననున్నారట. ఇక వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌తో పాటు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది.
నితిన్ ఈ ఏడాది భీష్మ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం రంగ్ దే.. అంధాదున్ రీమేక్‌తో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు దర్శకుడు కృష్ణ చైతన్యతో పవర్ పేట అనే ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.