కరోనా ఎఫెక్ట్ తో గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చెట్లకింద జరిగాయి. ఒక ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావడంతో అసెంబ్లీని శానిటైజ్ చేయడం కోసం మూసేశారు. దీంతో శనివారం అసెంబ్లీ ఆవరణలోని వేప చెట్ల కింద సమావేశాలను కొనసాగించారు. ఎటువంటి చర్చలేకుండా బడ్జెట్‌ను ఆమోదించి, సభను నిరవధిక వాయిదా వేశారు.
పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ జూలై 20న ప్రారంభమయ్యయి. స్పీకర్ శివ కొలుంధు, సీఎం నారాయణ స్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ సభకు హాజరయ్యారు. అయితే శుక్రవారం రాత్రి ప్రతిపక్ష నేత, AINRC ఎమ్మెల్యే జయబాల్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో శానిటైజ్ చేసేందుకు అసెంబ్లీ మెయిన్ హాల్‌ను క్లోజ్ చేశారు. దీంతో శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాలను చెట్ల కింద నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు.
వేగంగా అసెంబ్లీ సిబ్బంది ఏర్పాట్లు చేయడంతో సీఎం నారాయణ స్వామి రూ.9 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచగా.. అధికార, ప్రతిపక్ష సభ్యులంతా ఆమోదం తెలిపారు. ఇలా దాదాపు 2 గంటలకు పైగా సభ చెట్ల కింద జరిగింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ శివ కొలుంధు. కాగా, ఎమ్మెల్యేలంతా హోం క్వారంటైన్లో ఉండాలని, మరో రెండ్రోజుల్లో ఎమ్మెల్యేలందరికీ టెస్టులు చేస్తారని సీఎం నారాయణ స్వామి చెప్పారు