ఇండియాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 9 లక్షల మార్కును దాటేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలోనే భారత్‌లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… 553 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 23,727 గా నమోదైంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,06,752కు చేరింది. ప్రస్తుతం 3,11,565 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 5,71,460 మంది కోలుకున్నారు.

      మరోవైపు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన రెండు వారాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 6,327 మంది కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన మూడు రోజుల్లోనే దాదాపు లక్ష కేసులు బయటపడ్డాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

      ఇక దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను భారీగా నిర్వహిస్తోంది. జూలై 13 నాటికి దేశంలో కోటి 20 లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1200 కేంద్రాలకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు దాదాపు రెండు లక్షల శాంపిళ్లకు నిర్ధారణ పరీక్షలు జరుపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here