ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్-19 వ్యాక్సిన్ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం కరోనాని తరిమికొట్టగలమన్న ఆశల్ని పెంచుతోంది. రష్యాలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగం కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ తెలిపారు. కాగా గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లండన్‌కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అత్యంత పురోగతిలో ఉందని వెల్లడించింది.
ఆ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇప్పుడు రష్యా యూనివర్సిటీ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. మరోవైపు 2021 కంటే ముందు కరోనా మహమ్మారిపై 100 శాతం సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు ఫ్రాన్స్ కి చెందిన శాస్త్రవేత్తలు.