ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. నానాటికి కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. 20,256 శాంపిల్స్ పరీక్షించగా.. 961 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మందికి.. విదేశాల నుంచి వచ్చిన ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపీలో మొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 18,697కి చేరింది.
గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది చనిపోయారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఐదుగురు మరణించగా, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 232కి పెరిగింది. ఇప్పటివరకు 8422 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో 10043 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు మిలియన్ మార్కును దాటాయి. ఇప్పటివరకు 10,17,140 మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో కొవిడ్ పరీక్షల నిర్వహణలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ అగ్రస్థానంలో ఉంది.