తిరుమలలో కరోనా మహమ్మారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జూన్‌ నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీనగర్‌లోని ఓ వ్యక్తికి వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

       ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, పూజారులు సహా మొత్తం 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించారు, వారి కుటుంబసభ్యులను పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

      ఏ విధమైన కరోనా లక్షణాలున్నా కొండపైకి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు వారం రోజుల పాటు కొండపైనే ఉండే విధంగా షిఫ్ట్ లలో విధులను వేస్తున్నామని గుర్తు చేసిన ఆయన, గత నెల ఆఖరి వారంలో విధులు నిర్వహించిన వారిలో కొందరికి వైరస్‌ సోకిందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here