ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత బెంబేలెత్తిస్తున్నది. ఎన్ని చర్యలు తీసుకున్నా మహమ్మారి వైరస్ నియంత్రణలోకి రాని పరిస్థితి నెలకొంది. భద్రతా బలగాల్లో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరిగిపోతున్నది. సెంట్రల్ రిజర్వ్ డ్ పోలీస్ఫోర్స్ (CRPF) బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 18 మంది ITBP సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ITBP ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 421కి చేరింది. మొత్తం కేసుల్లో 270 మంది వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 151 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఐటీబీపీ ఉన్నతాధికారులు ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న151 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని వారు తెలిపారు.